సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజున హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశాం: చంద్రబాబు

  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • హైదరాబాద్ సిటీకి ల్యాండ్ మార్క్ లా నిలిచిపోయిందని వ్యాఖ్య
  • టీడీపీ అధినేతకు లోకేశ్ ప్రశంసలు
హైదరాబాద్ లో ఐటీ విప్లవానికి బీజం వేసిన హైటెక్ సిటీపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. సరిగ్గా 21 సంవత్సరాల కిందట ఇదే రోజున హైదరాబాద్ లో సైబర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని గుర్తు చేసుకున్నారు. బలమైన మూలాల కారణంగా నగరంలో ఓ ల్యాండ్ మార్క్ లో నిలిచిపోవడమే కాకుండా, రాష్ట్రంలో, దేశంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందని హైటెక్ సిటీ ప్రాశస్త్యాన్ని ట్వీట్ రూపంలో వెల్లడించారు. భారత్ ను ఓ ఐటీ సూపర్ పవర్ గా నిలిపే క్రమంలో ఇప్పటికీ హైటెక్ సిటీ ఓ వెలుగు దివ్వెలా కాంతులు పంచుతోందని పేర్కొన్నారు.

దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా స్పందించారు. చంద్రబాబునాయుడు దూరదృష్టి ఫలితమే హైటెక్ సిటీ ఆవిర్భావం అని ట్వీట్ చేశారు. సైబరాబాద్ చలవతో హైదరాబాద్ ఓ మహోన్నత నగరంగా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడ్ని ప్రశంసించారు. ఓ నాయకుడు ప్రజలకు ఇవాళేం కావాలన్నంత వరకే ఆలోచిస్తాడని, కానీ ఓ దార్శనికుడు ఇప్పటి ప్రజలకే కాకుండా భావితరాలకు ఏది అవసరమో దాని గురించి కూడా ఆలోచిస్తాడని వివరించారు.
Go Back to Shorts
Chandrababu
Hyderabad
Hitech City
Nara Lokesh

More Telugu News